ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కి సమయం ఆసన్నమైంది. మరికొద్ది రోజుల్లో ఈ మహాసమరానికి తెర లేవనుంది.
అయితే, ఈ మెగాటోర్నీకి ముందు టీమిండియాకు గట్టి షాక్ తగిలింది.
ఇప్పటికే గాయం వల్ల జడేజా దూరమయ్యాడు. ఇప్పుడేమో బుమ్రా వంతు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా గాయం కారణంగా టోర్నీకి దూరమవుతాడనే వార్తలు ఇప్పుడు అభిమానుల్లో కలవరం రేపింది.
గత ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే భారత్ ఇంటిముఖం పట్టింది.
ఆసియా కప్‌లో తప్ప మిగతా సిరీసుల్లో భారత్ విజయాలు సాధిస్తూ.. మంచి టచ్ లోనే ఉంది.
అయితే వెన్నునొప్పి కారణంగా ఆసియా కప్‌నకు దూరమైన బుమ్రా.. ఆసీస్‌తో సిరీస్‌కు వచ్చాడని సంబరపడ్డాం.
దక్షిణాఫ్రికా సిరీస్‌లోనూ ఆడతాడని ఆశగా ఎదురుచూశాం. అయితే మరోసారి వెన్ను నొప్పి తిరగబెట్టడంతో భారత అభిమానులకు నిరాశ తప్పలేదు.
డెత్ ఓవర్లలో టీమిండియా బలహీనతను తొలగిస్తాడని ఆశిస్తే.. జట్టులోనే లేకుండాపోయే ప్రమాదం వచ్చింది.
చివరి ఐదు ఓవర్లలో ఎక్కువగా పరుగులు సమర్పించుకోవడం వల్ల ఆసియా కప్‌లో భారత్ భారీ మూల్యం చెల్లించుకొంది.
ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ కొట్టాలనే కసితో ఉన్న సమయంలోనే పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరం కావడం గట్టి షాక్.
జడేజా స్థానంలో అక్షర్ పటేల్ సరిగ్గా సరిపోతాడని విశ్లేషకులు అంచనా వేశారు. వారికి తగ్గట్లుగానే అక్షర్ బౌలింగ్‌లో అదరగొట్టేస్తున్నాడు.
అయితే ఇప్పుడంతా బుమ్రాకి బదులు ఎవరు వస్తారు? అనేదానిపై చర్చ సాగుతోంది.
మొత్తానికి బుమ్రా టీమిండియా తురుపు ముక్క అవుతాడనుకుంటే.. ఇప్పుడు జట్టులోనే లేకుండా పోయాడు.