ఫేస్బుక్ పైత్యం రోజురోజుకీ ముదురుతోంది. సామాజిక మాధ్యమంగా ఉపయోగపడాల్సిన ఫేస్బుక్... ఎన్నో వివాదాలకు, అనేక సమస్యలకు కారణమవుతోంది. తాజాగా ఫేస్బుక్లో అసభ్యంగా కామెంట్ చేసిన ఓ టీనేజర్‌ను పడకగదికి పిలిచి, చితక్కొట్టింది ఓ మహిళ. బండ బూతులు తిడుతూ కుర్రాడిపై దాడి చేసి ఆంటీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. నవ్యాంధ్రలోని చిత్తూరు జిల్లా మిట్టూరుకు చెందిన గీతా రెడ్డి అనే మహిళ, ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టింది. దాన్ని చూసిన ఆమె బంధువు సాదిక్ అనే యువకుడు అసభ్యంగా కామెంట్ పెట్టాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె... సాదిక్‌ను ఇంటికి పిలిపించింది. పడక గదికి తీసుకెళ్లి... సాదిక్ చెంప చెల్లుమనిపించింది. అతన్ని బండబూతులు తిడుతూ తీవ్రంగా దాడి చేసింది. ఆమెతో పాటు గీతారెడ్డి కొడుకు శరత్ కుమార్, అతని స్నేహితులు కూడా సాదిక్‌ను తీవ్రంగా కొట్టారు. ఏడుగురు కలిసి చిత్తూరులో ఓ కల్యాణ మండపం దగ్గర మరోసారి సాదిక్‌పై దాడి చేశారు. ముఖంపై పిడి గుద్దులు గుద్దుతూ.. కడుపులో కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ మొత్తాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టడంతో వీడియో వైరల్ అవుతోంది.