నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా సి.నారాయణ రెడ్డి బాధ్యతలు తీసుకోని ఐదు రోజులు కూడా కాలేదు. అప్పుడే తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడికి వెళతారు.. ఎక్కడ తనికీ చేస్తారు అని కింది స్థాయి అధికారులు కంగారు పడుతున్నారు. ఈ రోజు నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, తాసిల్దార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా పర్యటించి తనిఖీ చేశారు. ముందుగా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఆయన అక్కడ ఇద్దరు డాక్టర్లు కూడా లేకపోవడం ఆ సమయంలో విధుల్లో ఉండవలసిన డాక్టర్ తరుణం రాజ్ గైర్హాజరు కావడం, హెడ్ నర్స్ ఝాన్సీ వాణి కలెక్టర్ తనిఖీ చేస్తున్న సమయంలో ఆలస్యంగా రావడం, రజనీ దేవి, నారాయణ, మంజుల, సరళ లేకపోవడం, కుమారి సెలవు దరఖాస్తు లో తేదీలు రాయకపోవడం, హాజరు రిజిస్టర్ ద్వారా గమనించారు. హాజరు రిజిస్టరు జిరాక్స్ తెప్పించుకున్నారు. అక్కడే ఉన్న తహసిల్దార్ లత కు ఆదేశిస్తూ వెంటనే వివరాలు పంపించవలసిందిగా తెలిపారు. ఆస్పత్రి అన్ని విభాగాలు పరిశీలించిన ఆయన పేషెంట్లు లేకపోవడం గురించి హెడ్ నర్స్ ను ప్రశ్నించారు.ఇంత మంచి ఫర్నిచర్ ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఉండదు.. కానీ ఇక్కడ పేషెంట్లు లేకపోవడాన్ని గమనించి డాక్టర్ లు సరిగా విధులలో ఉంటే పేషెంట్లు ఉండరా అని నిలదీశారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పర్యటించి విద్యార్థుల వివరాలు, ఎంత దూరం నుండి వస్తున్నారు, ఎలా వస్తున్నారని, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.