Coronavirus | Covid 19 : కరోనా వైరస్ పై ఎందుకంత భయపడటం... అవసరం లేదు... నన్ను చూడండి... అంటూ... కరోనా వైరస్ సోకిన వ్యక్తిని మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ప్రభుత్వం ఇంత చెబుతున్నా మాస్కుల కోసం ప్రజలు పడుతున్న ఆతృతకు కారణం... సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారమే అన్నారు మంత్రి ఈటల. కరోనా వైరస్ సోకిన 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ దగ్గరకు మంత్రి ఈటల స్వయంగా వెళ్లారు. ఆరోగ్యం ఎలా ఉందో మాట్లాడి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో భయపడవద్దనీ... ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్సలు అందించి పూర్తిస్థాయి ఆరోగ్యంతో బయటికి తీసుకువస్తుందని అతనికి భరోసా ఇచ్చారు. ప్రజల్లో ఉన్న అనుమానాల్నీ, భయాల్నీ తొలగించడానికే గాంధీ ఆస్పత్రిలో పర్యటిస్తున్నట్లు ఈటల తెలిపారు. కరోనా సోకిన వ్యక్తితో పాటు కరోనా వైరస్ సోకిందేమోనన్న అనుమానంతో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చి... వార్డులో ఉన్న వారిని కూడా మంత్రి కలిశారు. గాంధీ ఆసుపత్రిలో ఉన్న ఏర్పాట్లపై మాట్లాడారు.