హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న నిజాం కాలం నాటి భవనం కుప్పకూలింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ‘సరాయి’లోని ఒక భాగం కూలింది. సాధారణంగా అక్కడ యాచకులు ఉంటారు. అయితే, కూలిన సమయంలో అక్కడ కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారు గాయపడ్డారు. భవనం కూలిన సమాచారం అందిన వెంటనే జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించాయి. డి.ఆర్.ఎఫ్‌కు చెందిన రెండు ప్రత్యేక బృందాలు, జె.సి.బి, ఇసుజు వాహనంతో సహా చేరుకొని వెంటనే కూలిన శిథిలాలను తొలగించే ప్రక్రియను చేపట్టాయి. ఈ సంఘటనలో గాయపడ్డ ఇద్దరిని వెంటనే జిహెచ్ఎంసి అధికారులు ఆసుపత్రికి తరలించారు.