షాద్ నగర్ నిర్భయ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచారంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ ఈ దారుణంపై స్పందించారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ పూజారులు మృతురాలికి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆలయ ద్వారాన్ని 20 నిమిషాల పాటు మూసివేసి సంతాపం వ్యక్తం చేశారు. ఆ సమయంలో భక్తులెవరినీ దర్శనానికి అనుమతించలేదు.అదే సమయంలో మహిళల భద్రతను కాంక్షిస్తూ ఆలయం చుట్టూ మహాప్రదక్షిణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ సహా ఇతర పూజారులు పాల్గొన్నారు.