సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) బ్యాట్స్మాన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో వీరోచితంగా పోరాడాడు. మిగతా జట్టు సభ్యులు కనీసం డబుల్ డిజిట్ స్కోర్ చేరడంలో విఫలం అయినా.. కేన్ మాత్రం సమయోచింతగా ఆడి దాదాపు విజయానికి చేరువగా తీసుకొని వచ్చాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయలేక మ్యాచ్ సూపర్ ఓవర్‌కు (Super Over)దారి తీసింది. అక్కడ కేవలం 7 పరుగులు మాత్రమే చేశారు. డేవిడ్ వార్నర్ పూర్తిగా విఫలమయ్యాడు. ఆ ఏడు పరుగులైనా కేన్ విలియమ్సన్ కొట్టిన బౌండరీ వల్ల వచ్చాయి. అయితే ఢిల్లీ జట్టు కూడా కష్టపడి లక్ష్యాన్ని చేరుకున్నది. మ్యాచ్ అనంతరం కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ 'సూపర్ ఓవర్లు ఆడి వరుసగా ఓడిపోతుండటం పట్ల విసుగు చెందాను. సూపర్ ఓవర్లు నాకొక శాపంలా మారాయి' అని ఆవేదన వ్యక్తం చేశాడు. రికార్డులు పరిశీలిస్తే కేన్ విలియమ్సన్ చెప్పింది నిజమేనని అనిపిస్తున్నది. 2019 నుంచి ఇప్పటి వరకు 5 సూపర్ ఓవర్లలో కేన్ విలియమ్సన్ సూపర్ ఓవర్ ఓత్తిడిని అధిగమించలేకపోయాడు. వరుసగా ఇలాంటి మ్యాచ్‌లు కోల్పోవడం చాలా సిగ్గుగా కూడా ఉందని కేన్ అన్నాడు.
కేన్ విలియమ్సన్ న్యూజీలాండ్ కెప్టెన్‌గా 2019 నుంచి రెండు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు ఓడిపోయాడు. ఇందులో అత్యంత ముఖ్యమైనది 2019 వరల్డ్ కప్ ఫైనల్. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోర్లు టై కావడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లింది. అక్కడ కూడా మ్యాచ్ టై అవడంతో వివాదాస్పద 'బౌండరీ కౌంట్' నిబంధనతో ఇంగ్లాండ్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. కేన్ కోల్పోయిన అతిపెద్ద సూపర్ ఓవర్ మ్యాచ్ ఇదే అని చెప్పవచ్చు. 2020 మొదట్లో టీమ్ ఇండియా న్యూజీలాండ్ పర్యటనలో కూడా ఒక మ్యాచ్ ఓడిపోయాడు. ఆ మ్యాచ్‌లో కేన్ 95 పరుగులు చేసినా మ్యాచ్ టై అయ్యింది. అయితే సూపర్ ఓవర్లో రోహిత్ శర్మ రెండు భారీ సిక్సులు కొట్టడంతో కివీస్ ఓటమి పాలయ్యింది.
ఇక గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సూపర్ ఓవర్లో ఓడిపోయింది. కేన్ విలియమ్సన్ ఆడిన ఆ మ్యాచ్ టైగా మారింది. అయితే సూపర్ ఓవర్లో లాకీ ఫెర్గూసన్ వరుసగా రెండు వికెట్లు తీయడంతో మ్యాచ్ ఓడిపోయింది. 2019 ఐపీఎల్ సీజన్లో కూడా హైదరాబాద్ జట్టు ముంబై ఇండియన్స్‌పై సూపర్ ఓవర్లో ఓడిపోయింది. కేన్ విలియమ్సన్ ఆ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే జస్ప్రిత్ బుమ్రా అద్బుత బౌలింగ్‌తో హైదరాబాద్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌పై సూపర్ ఓవర్లో ఓడింది. ఇలా కేన్ విలియమ్సన్కు అటు న్యూజీలాండ్ జట్టుతో, ఇటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడినా సూపర్ ఓవర్లు మాత్రం కలసి రావడం లేదు.