స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ (Susheel Kumar) కోసం ఢిల్లీ పోలీసులు (Delhi Police) తీవ్రంగా గాలిస్తున్నారు. యువ రెజ్లర్ సాగర్ దండక్ హత్య తర్వాత కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సుశీల్ కుమార్ కోసం ఢిల్లీ పోలీసులు 8 బృందాలు ఏర్పాటు చేశాయి. హత్య జరిగి వారం రోజులు అవుతున్నా ఇప్పటికీ అతడి ఆచూకీ లేకుండా పోయింది. దీంతో తాజాగా ఢిల్లీ పోలీసులు 'లుక్ అవుట్' నోటీసులు (Lookout Notice) జారీ చేశారు. హత్యకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో సుశీల్ కుమార్ పేరు ఉన్నది. దీంతో అతడిని పట్టుకునేందుక పోలీసులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా అతడి ఆచూకీని కనిపెట్టలేకపోయారు. కాగా, గత మంగళవారం ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం పార్కింగ్ ఏరియాలో సాగర్ దండక్‌తో పాటు మరో ఇద్దరిపై సుశీల్ కుమార్ అతడి స్నేహితులు దాడికి పాల్పడ్డారు. హాకీ స్టిక్స్, బేస్ బాల్ బ్యాట్లతో దాడి చేయడంతో సాగర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, దాడి జరిగిన అనంతరం సుశీల్ కుమార్ తాను అక్కడ లేనని.. దాడితో సంబంధం లేనని చెప్పుకొచ్చాడు. అయితే నిందితుల్లో ఒకరి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లో సుశీల్ నేరుగా దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. సుశీల్ దాడిలో పాల్గొన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పోలీసులు కూడా ప్రకటించారు.
ఇక యువ రెజ్లర్ సాగర్ దండక్ హత్య కేసులో దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ ఉండటం భారత రెజ్లింగ్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందని భారత రెజ్లింగ్ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు రెజ్లర్లు అంటే గూండాలనే పేరుండేది. క్రమంగా ఆ అపవాదును తొలగించుకొని దేశానికి రెజ్లర్లు ఎంతో పేరు తీసుకొని వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరువు, ప్రతిష్ట అంతా ఒక్క హత్యతో తుడిచిపెట్టుకొని పోయిందని సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వైపు సుశీల్ కుమార్ ప్రవర్తన మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉండేది. 2016 రియో ఒలంపిక్స్‌లో సుశీల్ కుమార్ పోటీ చేయాల్సిన విభాగంలో నర్సింగ్ యాదవ్ అర్హత సాధించాడు. అయితే ఆ తర్వాత జరిపిన డోపింగ్ పరీక్షలో నర్సింగ్ యాదవ్ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. కాగా, ఈ ఉత్ప్రేలకాల వెనుక సుశీల్ కుమార్ ఉన్నాడనే వాదన ఉన్నది. కావాలనే నర్సింగ్ ఆహారంలో కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. మరోసారి సహచర రెజ్లర్ ప్రవీణ్ రాణాపై చేయి చేసుకొని సుశీల్ కుమార్ వార్తల్లోకి ఎక్కడు.