ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను టీమిండియా సీరియస్‌గా తీసుకుంది. కంగారూ గడ్డపై మూడు మ్యాచ్‌ల ట్వంటీ ట్వంటీ సిరీస్ కోసం విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఆటగాళ్లు సమాయత్తమవుతున్నారు. ఈ సిరీస్ కోసం ఐదు రోజుల ముందే ఆస్ట్రేలియా చేరుకున్న భారత క్రికెటర్లు...ప్రస్తుతం బ్రిస్బేన్ గబ్బా ఇంటర్నేషనల్ స్టేడియంలో చెమటోడుస్తున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్స్‌లో ఈ సారి భారత జట్టు కొత్త స్ట్రాటెజీ ఫాలో అవుతోంది. కెప్టెన్ విరాట్ కొహ్లీ, చీఫ్ కోచ్ రవిశాస్త్రి కొత్త ఫార్ములా ఫాలో అవుతున్నారు. భారత పేస్ బౌలింగ్ త్రయం భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్ సైతం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సాధారణంగా జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ నెట్స్‌లో బ్యాటింగ్ టెక్నిక్కు పదును పెట్టడం కొత్తేమీ కాకపోయినా...మునుపెన్నడూ లేనంతలా ఈ ముగ్గురూ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.