తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ జిమ్మిక్కులకు పాల్పడింది. 4వ వార్డు టీడీపీ అభ్యర్ధి ఇంట్లోకి అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. గుట్టు చప్పుడు కాకుండా మద్యం బాటిళ్లు వాటర్ ట్యాంక్ వద్ద ఉంచి పరారయ్యారు. ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాల్లో స్పష్టంగా నమోదైంది. అయితే ఈ రోజు ఉదయం టీడీపీ అభ్యర్థి ఇంటికి ఎక్సైజ్ అధికారులు చేరుకున్నారు. వచ్చిరాగానే వాటర్ ట్యాంక్ ఎక్కడా?, ఎన్ని ఫ్లోర్లు అంటూ అధికారులు నానా హంగామా చేశారు. పై అంతస్థులోని పెంట్‌హౌస్‌లో ఉంటున్న అభ్యర్థి బంధువు కార్తీక్‌ను అధికారులు వెంట తీసుకెళ్లారు. అధికారుల తీరుపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదైన వ్యక్తులను గుర్తించకుండా తమ ఇంట్లో వారిని బెదిరించడంపై కుటుంబ సభ్యులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.