తెలంగాణలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అటు మూడో విడత ఎన్నికలకు ప్రచారం కొనసాగుతోంది. ఈ క్రమంలో సూర్యాపేటలో పరిషత్ ప్రచారంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చింతలపాలెం పీక్లానాయక్ తండాలో ఇరుపార్టీల నేతలు కొట్టుకున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. తమ ఊరికి ఏం చేశారంటూ నిలదీశారు. దాంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలను చితకబాదారు. అనంతరం ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలుకావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల కుమ్ములాటతో పీక్లా నాయక్ తండాలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.