తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్వాడ దగ్గర అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను జన్వాడ వస్తే... పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారని అన్నారు. రూ. 250 కోట్ల విలువైన ఈ భూమిలో రూ. 25 కోట్లు పెట్టి కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకే తాను ఇక్కడికి వచ్చానని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. దీంతో రేవంత్ రెడ్డితో పాటు జన్వాడకు వచ్చిన మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.