కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సహకరించేందుకు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనేక మంది ప్రముఖులు, సంస్థలు స్పందించాయి. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించాయి. ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ రూ.50 లక్షల విరాళం అందించింది. ఎఐజి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ డివిఎస్ రాజు దీనికి సంబంధించిన చెక్కును ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందించారు. అరబిందో ఫార్మా మొత్తం 11 కోట్ల విలువైన నగదు, శానిటైజర్లు, మందులు విరాళంగా అందించారు. రూ.7.5 కోట్ల నగదుకు సంబంధించిన చెక్కును అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డి, డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సిఎంకు అందించారు. రూ.2.5 కోట్ల విలువైన శానిటైజర్లను, రూ.ఒక కోటి విలువైన మందులను రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వనున్నట్లు ప్రకటించారు.