హైపవర్ కమిటీ రెండో సమావేశంలో కీలక ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్ కాన్ఫరెన్స్ హాల్లో హైపవర్ కమిటీ రెండో సారి భేటీ అయింది. అమరావతి నుంచి విశాఖకు తరలి వచ్చే ఉద్యోగులకు.. విశాఖ నగరాభివృద్ధి పరిధిలో 25 లక్షలకే ఇంటి స్థలం కేటాయించాలని ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. భాగస్వామి ఉద్యోగి అయితే.. సదరు విభాగంలో ఖాళీతో నిమిత్తం లేకుండా విశాఖకు బదిలీ చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. హెచ్ఆర్ఏ 30 శాతం, 10శాతం సీసీఏ.. ఇంటి సామాన్ల తరలింపు కోసం హోదా బట్టి లక్ష నుంచి 50 వేలు అందజేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఉచిత నివాస వసతి, కుటుంబంతో సహా తరలి వస్తే.. నెలకు రూ.4 వేల చొప్పున రాయితీ అద్దె చెల్లించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. వారానికి ఐదు రోజుల పనిదినాల కొనసాగింపు... స్థానికత అంశంపై 2024 వరకు గడువు పెంపుదల... అమరావతిలో ఇచ్చినట్టే బస్సు, రైలు ప్రయాణ రాయితీని కొనసాగించాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఒక్కొక్క ఉద్యోగికి 200 గజాల స్థలం కేటాయింపు ప్రతిపాదనలను హై పవర్ కమిటీ చేసినట్టు తెలుస్తోంది.