ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఐదేళ్లలో రూ.2లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పెడతామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తెలిపారు. ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. కడప జిల్లాలో నిర్మించ తలపెట్టిన స్టీల్‌ప్లాంట్‌కు ఎన్ఎండీసీ నుంచి ఇనుపఖనిజం సరఫరాపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తిపై ధర్మేంద్ర ప్రదాన్ సానుకూలంగా స్పందించారు. ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజాన్ని సరఫరాచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఎండీసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. పునర్వివిభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికోసం ప్రపంచంలోని ప్రఖ్యాత ఉక్కుకంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని అధికారులు వివరించారు. ప్లాంటు నిర్వహణలో స్థిరత్వం సాధించడానికి నిరంతరాయంగా ఇనుపఖనిజాన్ని సరఫరాచేయాలని ముఖ్యమంత్రి కోరారు.