'అత్యాచారాల భారతం' అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు క్షమాపణ అడుగుతున్నారని.. కానీ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నిజం మాట్లాడేందుకు క్షమాపణ చెప్పడానికి తాను రాహుల్ సావర్కర్‌ను కాదని.. రాహుల్ గాంధీని అని స్పష్టం చేశారు. నిజాలు నిర్భయంగా మాట్లాడేందుకు తానెవరికీ భయపడనని అన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ అత్యంత పతనావస్థలో ఉందని.. ప్రపంచమంతా భారత్‌లో ఏం జరుగుతోందని ఆరా తీస్తోందంటూ వ్యాఖ్యానించారు. భిన్న సంస్కృతులకు,భిన్న ధర్మాలకు నెలవైన దేశంలో విభజన రాజకీయాలతో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ విధానాలతో అసోం నుంచి కశ్మీర్ వరకు అంతా తగలబడిపోతోందన్నారు. బీజేపీ ఆర్థిక విధానాలు,ఎన్‌ఆర్‌సీ,రైతు సమస్యలు,నిరుద్యోగం వంటి వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన 'భారత్ బచావో' సభలో రాహుల్ ఒకింత ఆవేశంగా మాట్లాడారు.