కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావంగా, చేపడుతున్న చర్యలకు ఉపయోగపడేలా పలువురు ప్రముఖులు, సంస్థలు సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. తెలంగాణ ఐకెపి విఓఎలు 1,72,61,000 రూపాయలను విరాళంగా అందించారు. రాష్ట్రంలో మొత్తం 17,261 మంది విఓఏలున్నారు. వారికి నెలకు మూడు వేల రూపాయల వేతనం వస్తుంది. దీంట్లోంచి వారు ఒక్కొక్కరు వేయి రూపాయలు విరాళంగా ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఐకెపి విఓఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్.రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శి మారిపెల్లి మాధవి, కోశాధికారి తిరుపతిలు ఈ విరాళాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సోమవారం ప్రగతి భవన్ లో అందించారు.