అసోం.. స్థానిక ప్రజల సారథ్యంలోనే నడుస్తుందని,అసోంపై నాగ్పూర్ పెత్తనం చేయడం కుదరదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అసోం చరిత్ర,సంస్కృతిపై బీజేపీ,ఆర్ఎస్ఎస్ల దాడిని చూస్తూ ఊరుకోబోమన్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా.. ప్రభుత్వం ప్రజల గొంతుకను వినిపించుకోవడం లేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసోంలో జరుగుతున్న నిరసనలు మూడో వారానికి చేరుకున్న నేపథ్యంలో గువాహటిలో 'రాజ్యాంగ రక్షణ-భారత రక్షణ' పేరుతో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పాల్గొని ప్రసంగించారు.