అమరావతి రాజధాని కోసం ఉద్యమిస్తున్న అమరావతి పరిరక్షణ సమితికి ఏపీ పోలీసులు షాకిచ్చారు. మూడు రాజధానులను నిరసిస్తూ జేఏసీ, విపక్షాలు తలపెట్టిన బస్సు యాత్రను అడ్డుకున్నారు. ఆర్టీఏతో పాటు పోలీసుల నుంచి అనుమతి లేనిదే బస్సులను కదలనివ్వబోమని తేల్చి చెప్పారు. దాంతో జేఏసీ బస్సులు షెడ్డుల వద్దే నిలిచిపోయాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఈ బస్సు యాత్ర తలపెట్టింది జేఏసీ. అమరావతి ఉద్యమాన్ని జిల్లాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 5 బస్సులతో 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రైతులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలతో యాత్ర నిర్వహించాలని ప్లాన్ చేశారు. బెంజి సర్కిల్ నుంచి ఈ బస్సు యాత్రను చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సి ఉంది. ఐతే అనుమతులు లేవని బస్సు యాత్రను అడ్డుకున్నారు పోలీసులు.