తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏపీలోకి కరోనా ప్రవేశించకుండా చర్యలకు సిద్ధమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టడంపై, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. చర్యలకు దిగాల్సిన సమయం ఆసన్నమైందని, ముందుగానే సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. కరోనా వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. వీలైనన్ని మాస్కులు అందుబాటులోకి తేవాలని సూచించారు. గ్రామ సచివాలయాల్లో కరోనాపై సూచనలు, జాగ్రత్తలతో కూడిన కరపత్రాలు ఉంచాలని స్పష్టం చేశారు. అయితే, ప్రజలు మాత్రం ఆందోళనకు గురికావొద్దని అన్నారు.