ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘కులం జోలికి వస్తే లేపేస్తామంటున్నాడు ఓ మాజీ ఎంపీ. ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో సామాజిక దూరం పాటించాలి, కానీ సామాజిక కులాలను విడదీసే భయంకరమైన వ్యాధిని తెస్తున్నారు. కులాల మధ్య మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ను లేపేస్తారా?’ అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫ్యాక్షనిస్టు రాజ్యమని లేఖలో వ్రాయడంఏంటని, ఇవేం కుల రాజకీయాలని ప్రశ్నించారు. రాజధానుల వికేంద్రీకరణ విషయంలో వ్యతిరేకించారని, కియాపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కులమతాలు తమకు అవసరం లేదన్న శ్రీకాంత్ రెడ్డి.... దేశంలోనే వెనుకబడిన వర్గాలకు 50% రిజర్వేషన్ లు కల్పించిన ఏకైక నాయకుడు జగన్ అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.