తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి చెందాడు. నారాయణఖేడ్ డిపోకి చెందిన ఆర్టీసీ కండక్టర్ నాగేశ్వర్ గురువారం ఉదయం ఆందోల్ మండలం జోగిపేటలో కన్నుమూశాడు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కొంతకాలంగా నాగేశ్వర్ తీవ్ర మనస్తాపంతో ఉంటున్నాడు. ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ కార్మికులకు డెడ్లైన్ విధించడం ఆయన్ను మరింత కలచివేసింది. ఈ నెల 5వ తారీఖు డెడ్లైన్ పూర్తవడంతో.. అప్పటినుంచి మానసికంగా మరింత ఆందోళనకు గురయ్యాడు.సమ్మె కారణంగా జీతం డబ్బులు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. భవిష్యత్ గురించి తీవ్రంగా కలత చెందిన నాగేశ్వర్.. మతిస్థిమితం కోల్పోయి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నాగేశ్వర్ ప్రవర్తనతో ఆవేదన చెందిన అతని భార్య అతన్ని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ చికిత్సకు నిరాకరించారు. దీంతో చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు. అద్దె ఇంట్లో యజమానుల ఒత్తిడి కారణంగా భర్త,ఇద్దరు పిల్లలను తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్లారు. నాగేశ్వర్కి చికిత్స అందిస్తున్న క్రమంలో గురువారం తెల్లవారుజామున అతను కన్నుమూశాడు.