Karnataka Bypolls Results : కర్ణాటకలో బీజేపీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే... ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే... ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ప్రజలే సరైన శిక్ష వేస్తారని... ఈ ఫలితాల్ని చూస్తే అర్థమవుతుందని మోదీ అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. కమలం పార్టీ నేతలు సీట్లు పంచుకొని, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 12 చోట్ల గెలుపొందగా... కాంగ్రెస్ 2, జేడీఎస్ 0, ఇతరులు ఒక స్థానం (హోస్కోట్లో స్వతంత్ర అభ్యర్థి శరత్ బచీచ్ గౌడ్ ) దక్కించుకున్నారు. అందువల్ల బీజేపీకి మరోసారి భారీ విజయం దక్కినట్లైంది. కనీసం 6 అసెంబ్లీ స్థానాలు గెలిస్తేనే యడ్యూరప్ప ప్రభుత్వం అధికారంలో కొనసాగే అవకాశాలు ఉన్న సమయంలో... ఏకంగా 12 స్థానాలు దక్కడంతో... యడ్యూరప్ప ఫుల్ ఖుషీగా ఉన్నారు.