IAF AN-32 Aircraft: గత వారం అస్సాం నుంచి బయలు దేరి ఆచూకీ కనిపించకుండా పోయిన భారత వైమానిక దళ విమానం కోసం చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఏఎన్ -32 విమాన శకలాలను అరుణాచల్ ప్రదేశ్ లోని అటవీ ప్రాంతంలో గుర్తించారు. ఐఏఎఫ్ విమానం శకలాలు అరుణాచల్ ప్రదేశ్ లోని ఉత్తర లిపో ప్రాంతంలో గుర్తించినట్లు వైమానిక దళ అధికారులు నిర్ధారించారు. ఎంఐ 17 హెలికాప్టర్ ద్వారా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా విమాన శకలాలు బయటపడ్డాయి. అయితే విమానంలో ప్రయాణిస్తున్న 13 సిబ్బంది పరిస్థితి గురించి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. దీని కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన గాలింపును కొనసాగిస్తూనే ఉంది.