కరోనా వైరస్ ప్రభావంతో చిలుకూరు బాలాజీ దేవాలయం నేటి నుంచి మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకుడు రంగరాజన్ ప్రకటించారు. ఈ నెల 19 నుంచి 25 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాలాజీ ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఎక్కువ సమయం ఉంటున్నారని, దీని వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. కొంత మంది భక్తులు విదేశాల నుంచి నేరుగా ఆలయానికి వచ్చి ప్రదక్షిణలు చేస్తుంటారని అలాంటి వారిని ప్రత్యేకంగా గుర్తించలేమన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి రోజూ చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తులు బాగానే వస్తున్నారని ఆయన చెప్పారు.