ఆంధ్రప్రదేశ్‌లో క్వారంటైన్లో ఉన్న వారికి అధికారులు కల్పిస్తున్న సౌకర్యాలపై బ్రిటన్ పౌరుడు ప్రశంసలు కురిపించాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత భారత్ నుంచి యూకే వెళ్లడానికి అనుమతి వచ్చిన తర్వాత ఆయన అధికారులను ప్రశంసిస్తూ ఓ లేఖ రాశాడు. బ్రిటన్‌లోని వేల్స్ రాష్ట్రానికి చెందిన కల్లీ క్లైవ్ బ్రయాంట్ తిరుపతిలో క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. మళ్లీ తాను తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని సందర్శిస్తానని చెప్పాడు. అలాగే, తనను బాగా చూసుకున్న అధికారులను అప్పుడు తప్పకుండా కలుస్తానని తెలిపాడు. కల్లీ క్లైవ్ బ్రయాంట్ 2019 అక్టోబర్‌లో భారత పర్యటనకు వచ్చాడు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చాడు. అయితే, కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించింది భారత ప్రభుత్వం. విదేశీయుడు కావడంతో కల్లీ క్లైవ్ బ్రయాంట్‌ను మార్చి 24 న క్వారంటైన్‌కు తరలించారు. ఆయనకు రెండు సార్లు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. అయినా, లాక్ డౌన్ వల్ల విమానాలు నిలిచిపోవడంతో కల్లీ క్లైవ్ బ్రయాంట్ బ్రిటన్ వెళ్లడానికి వీల్లేకుండా పోయింది. దీంతో తిరుపతిలోని క్వారంటైన్ కేంద్రంలోనే ఉండిపోయాడు. ఏప్రిల్ 17వ తేదీన హైదరాబాద్ నుంచి విమానంలో అహ్మదాబాద్ వెళ్లనున్నారు. అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ ద్వారా బ్రిటన్ వెళ్తారు. దీంతో కలెక్టర్ అనుమతితో కల్లీ క్లైవ్ బ్రయాంట్‌ను క్వారంటైన్ కేంద్రం నుంచి డిశ్చార్జ్ చేశారు. వెళ్లేటప్పుడు తన స్వదస్తూరీతో అధికారులను అభినందిస్తూ లేఖ రాశాడు.