విద్యావేత్త, బిజినెస్ వుమెన్, దాతృత్వ కార్యక్రమాల్లో ముందుండే నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో గౌరవ ధర్మకర్తగా చోటు దక్కింది. మ్యూజియం ఛైర్మన్ డేనియల్ బ్రాడ్స్కీ ఈ విషయాన్ని ప్రకటించారు. నవంబర్ 12న బోర్డ్ మీటింగ్‌లో జరిగిన ఎన్నికలో నీతా అంబానీని ఎన్నుకున్నారు. ఈ గౌరవం దక్కిన మొదటి భారతీయురాలు నీతా అంబానీ కావడం విశేషం. 2017లో వింటర్ పార్టీకి నీతా అంబానీని ఆహ్వానించి అరుదైన గౌరవాన్ని అందించిన ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్... ఇప్పుడు బోర్డులోకి తీసుకోవడం విశేషం. భారతదేశంలో దాతృత్వ సంస్థ అయిన రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ అయిన నీతా అంబానీ 2016లో నస్రీన్ మొహమదీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిననాటి నుంచి ది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు సపోర్ట్ ఇస్తున్నారు. అమెరికాలో ఇలాంటి ఎగ్జిబిషన్లు నిర్వహించడం అదే మొదటిసారి. 2017 లో భారతదేశానికి చెందిన కళలను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఇలాంటి మరిన్ని ఎగ్జిబిషన్లను నిర్వహించింది రిలయెన్స్ ఫౌండేషన్.