లాక్‌డౌన్‌ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. వారు మాత్రం ఇదే అదనుగా దోపిడీకి తెరలేపారు. నిత్యావసర ధరలు, కూరగాయలను అధిక ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. విజయనగరం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. కొందరు వ్యాపారులు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని పట్టుకునేందుకు స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టరే రంగంలోకి దిగారు. విజయనగరం జిల్లాలో లాక్‌డౌన్, 144 సెక్షన్ కారణంగా నిత్యావసర వస్తువులు, కొరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు రావటంతో.. జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ దీనిపై దృష్టి సారించారు. మంగళవారం ఉదయం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు కూరగాయల మార్కెట్, కిరాణా దుకాణాలకు సామాన్య వ్యక్తిలా మారువేషంలో వెళ్లి ధరలను తెలుసుకున్నారు. ఇతర కొనుగోలు దారుల నుంచి ధరలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు కిషోర్ కుమార్. కొన్ని చోట్ల కూరగాయలను 5 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇక ప్రజల కోసం సాధారణ మనిషిలా వచ్చిన జాయింట్ కలెక్టర్‌ను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.