ఆడుకుంటూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు రెండు గోడల మధ్య ఇరుక్కుపోయారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ ప్రహరీ గోడకు, స్కూల్ గోడకు మధ్యలో ఉన్న చిన్న సందులో ఇరుక్కుపోయారు. తాడేపల్లి నులకపేట ఉర్దూ పాఠశాల ప్రహరీ గోడ సందులో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నపిల్లలు ఇరుకున్నారు. విషయం తెలుసుకున్న వారు అక్కడకు చేరుకుని చూడగా వారు ఊపిరి ఆడక ఇబ్బంది పడటం స్థానికులు గమనించారు. వారిద్దరూ రమణబాబు, మున్నాలుగా గుర్తించారు. ఈ ఇద్దరు పిల్లల వయస్సు నాలుగు సంవత్సరాలు. వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమయానికి పాఠశాల సిబ్బంది, స్థానికులు బాలలను బయటకు తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అసలు వారు ఎలా పడ్డారు?, అని స్థానికులు చర్చించుకుంటున్నారు. మరో వైపు పాఠశాలలో విద్యాభ్యాసం కోసం వచ్చే వారు కాదని స్కూల్ అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు వారిని ఎలా వదిలి వెళ్ళారో అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి తాడేపల్లి ఎస్ఐ వినోద్ కుమార్ పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.