TTD Temple in Jammu and Kashmir : TTD దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి ఆలయాల్ని నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నిర్మించింది. తాజాగా... జమ్మూకాశ్మీర్లో మరో ఆలయాన్ని నిర్మించబోతోంది. ఈ నిర్ణయాన్ని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్ఛకులు స్వాగతించారు. జమ్మూకాశ్మీర్లో తిరుమల తరహాలో ఓ శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం TTD రెడీ అవుతోంది. ఈ ఆలయ నిర్మాణానికి ఆల్రెడీ అనుమతులు వచ్చేశాయి. ఇందుకోసం మొత్తం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిసింది. ఈ స్థలం జమ్మూ-కత్తా హైవే పక్కన ఉన్నట్లు తెలిసింది. ప్లాన్ ప్రకారం... రెండేళ్లలో ఈ ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. ఆలయంతోపాటూ... 100 ఎకరాల స్థలంలోనే ఓ వేద పాఠశాల, ఓ కల్యాణ మంటపం, ఓ హాస్పిటల్ కూడా నిర్మించబోతున్నట్లు తెలిసింది. ఈ ఆలయ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో టీటీడీ బోర్డు ప్రతినిధి బృందం చర్చించగా... వెంటనే ప్రభుత్వం... ఆలయ ఏర్పాటు దిశగా జమ్మూకాశ్మీర్లో సంప్రదింపులు, చర్చలు జరిపింది. తిరుమలకు ఎక్కువగా దక్షిణాది, మధ్య రాష్ట్రాల భక్తులు వస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల భక్తులు సందర్శించేందుకు వీలుగా కాశ్మీర్లో ఆలయాన్ని నిర్మించబోతుండటం విశేషం.