ఓవైపు ఏపీ రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చెయ్యాలనే అంశంపై, GN రావు కమిటీపై ఏపీ కేబినెట్ చర్చిస్తుంటే... మరోవైపు అమరావతిలో రైతులు భగ్గుమంటున్నారు. పదో రోజు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశారు. నిడమర్రులో రైతులు... SRM యూనివర్సిటీ బస్ అద్దాలు పగలగొట్టారు. కాలేజీ బంద్ చెయ్యకుండా... స్టూడెంట్స్ కోసం బస్ నడిపినందుకు ఆగ్రహించిన రైతులు అద్దాలు పగులగొట్టారు. మరోవైపు రాజధానిగా అమరావతినే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ,... మంగళగిరి, తుళ్లూరు మండలాల్లో రైతులు, రైతు కూలీలు చేస్తున్న నిరసనలు భగ్గుమంటున్నాయి. ఎర్రబాలెం గ్రామంలో మాజీ ZPTC ఆకుల జయసత్య అధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. రోడ్డుపై పడుకొని వాహనాల్ని అడ్డుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అంశంపై తాజాగా చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ బొత్సా ఇంటిని ముట్టడించారు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం. బొత్సాకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బొత్స రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన్ని అదుపులోకి చేసిన పోలీసులు... సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కి తరలించారు. విజయవాడ గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం ఉంది. రాజధానిని మార్చవద్దంటూ వేలాదిగా జాతీయ రహదారిపైకి వచ్చిన మహిళలు, రైతులు, ప్రజలతో కలసి రోడ్డుపై బైఠాయించారు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. నిరసన ప్రదర్శనను అడ్డుకోవడంతో గొల్లపూడి 1 సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిరసన తెలుపుతున్నారు దేవినేని ఉమా.