అమరావతిలో శాంతియుత నిరసనలకు పోలీసులు అనుమతించారు. ఐతే ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. ప్రస్తుత సచివాలయ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మందడం, మల్కాపురంలో భారీ బందోబస్తు కొనసాగుతోంది. పాలు, మందుల షాపుల్ని మాత్రమే తెరిచేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. పోలీసుల అధీనంలో సచివాలయం ఉండగా... వెలగపూడి, కృష్ణాయపాలెంలో రైతులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. రైతులు రోజూ ధర్నా చేసే ప్రదేశంలో పోలీసులు వాహనాల్ని ఉంచారు. ధర్నా ప్రదేశానికి రైతులు రాకుండా... బారికేడ్లు అడ్డుపెట్టారు. ప్రస్తుతం ముగ్గురు డీఎస్పీల పర్యవేక్షణలో అమరావతి ప్రాంతం ఉంది. సెక్రెటేరియట్, అసెంబ్లీ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. రాజధాని ప్రాంతంలో ధర్నాలు, ఆందోళనలు చేయడం నిషిద్ధమన్న పోలీసు అధికారులు... నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.