ఓవైపు వైసీపీ ప్రభుత్వం... విశాఖ శివార్లలోని భీమిలీ చుట్టుపక్కల పరిపాలక రాజధాని కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తుంటే... ఇటువైపు అమరావతిలో భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు ఆరో రోజు మహా ధర్నాతో ఆందోళనలను తీవ్రతరం చేశారు. రోడ్లను దిగ్బంధిస్తూ, బైటాయిస్తూ, టైర్లను తగలబెడుతూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ... ఇలా ఎలా వీలైతే అలా తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి, అమరావతి నుంచీ రాజధానిని విశాఖకు తరలిస్తోందంటూ రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆందోళన చేస్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకుంటుండటంతో అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు, తోపులాటలు, ఘర్షణలు జరుగుతున్నాయి.