Telugu News » Tag » Team India
Team India

Team India వార్తలు

    భారతదేశంలో జనం క్రికెట్ ను ఒక మతంగా చూస్తారు. ముఖ్యంగా 80వ దశకం తర్వాత క్రేజే మారిపోయింది. కపిల్ దేవ్ (Kapil Dev), సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ఒక తరానికి ఆదర్శంగా నిలిస్తే తర్వాత వచ్చిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar).. క్రికెట్ దేవుడు అయిపోయాడు. సచిన్, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) , సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) వంటి వారి ఆగమనం భారత క్రికెట్ (Indian Cricket) లో యువతలో ఎంతో స్ఫూర్తినింపింది.

    భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ప్రాతినిధ్యం వహించే జట్టుకు భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) అని పిలుస్తారు. ఇది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అజమాయిషీలో ఉంటుంది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే స్పాన్సర్‌షిప్ రూపంలో అత్యధిక డబ్బును ఇచ్చే క్రికెట్ జట్టుగా నిలిచింది.

    టీమిండియా మొట్టమొదటి సారిగా 1921లో తొలి క్రికెట్ మ్యాచ్ ఆడింది. కాని అధికారికంగా మొదటి టెస్ట్ మ్యాచ్ 1932, జూన్ 25న ఇంగ్లాండుతో లార్డ్స్(Lords) ఆడి టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆరో దేశంగా స్థానం సంపాదించింది. అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన తొలి 50 ఏళ్లలో మొత్తం 196 టెస్టులు ఆడి కేవలం 35 విజయాలను మాత్రమే నమోదు చేసింది టీమిండియా.

    50 ఏళ్ల తర్వాత సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) రూపంలో ప్రముఖ బ్యాటర్, కపిల్ దేవ్ (Kapil Dev) రూపంలో దిగ్గజ ఆల్ రౌండర్ భారత జట్టులో స్థానం సంపాదించారు. అప్పటినుంచి టెస్టులలోనూ, వన్డే క్రికెట్ లోనూ టీమిండియా సత్తా చాటింది. ఇదే క్రమంలో 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో 3వ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో అప్పటి దిగ్గజాలైన విండీస్ (West Indies) జట్టును ఫైనల్‌లో ఓడించి అపూర్వమైన విజయాన్ని భారత క్రికెట్ జట్టు సాధించింది.

    1985లో ప్రపంచ చాంపియన్‌షిప్ ట్రోఫీ తరువాత భారతజట్టు సాధించిన గొప్ప విజయం 2007లో మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) నేతృత్వంలో సాధించిన తొలి ట్వంటీ-20 ప్రపంచకప్ టైటిల్. ఇక, 1990ల్లో భారత జట్టులో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే లాంటి ప్రముఖ ఆటగాళ్ళు జట్టులో స్థానం సంపాదించి లెక్కకు మిక్కిలి ప్రపంచ రికార్డులు సృష్టించారు.

    ఇండియాలో ఫస్ట్ క్లాస్ క్రికెట్
    ఇక, ఫస్ట్ క్లాస్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా జట్టులో చోటు దక్కుతుంది. భారత్ లో రంజీ ట్రోఫీ, విజయ హాజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ కుర్రాళ్లకు మంచి అవకాశాల్ని అందిస్తున్నాయ్.