HOME » sai pallavi
Sai Pallavi

Sai Pallavi

పేరు: సాయి పల్లవి

పుట్టిన రోజు: 09-05-1992

సినిమాలు: కస్తూరి మన్ (చైల్డ్ ఆర్టిస్ట్), ధాం ధూం (చైల్డ్ ఆర్టిస్ట్), పందెం కోడి, ప్రేమమ్ (Premam), కాళి, ఫిదా (Fidaa), మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA), దియా, కణం, పడిపడి లేచే మనసు (Padipadileche Manasu), మారి 2 (Maari 2), అథిరన్, ఎన్‌జీకే, పావ కథైగళ్, లవ్ స్టోరీ (Love Story)

రిలీజ్‌‌కు రెడీగా ఉన్న సినిమాలు: శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy), విరాటపర్వం (Virata Parvam)

సాయి పల్లవికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలోనూ అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. వరస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పుతుంది సాయి పల్లవి. తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలో మే 9, 1992న జన్మించింది. ఆమె తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి అని చేర్చింది. పల్లవి కూడా చిన్నప్పటి నుంచి సాయి భక్తురాలు. ఇప్పటికీ ఈమె పుట్టపర్తి వెళ్లి కొన్ని రోజులు అక్కడే ఉండి సేవ చేయడం అలవాటు. హీరోయిన్ అయిన తర్వాత కూడా ఈ అలవాటు మానుకోలేదు. కేవలం నటిగానే కాకుండా మంచి డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె తండ్రి సెంతామరై కస్టమ్స్ అధికారి. సాయి పల్లవికి చెల్లి ఉంది. ఆమె పేరు పూజా. ఇద్దరూ కవల పిల్లలు. వాళ్ల సొంత గ్రామానికి అక్కడికి దగ్గరలో ఉన్న కోయంబత్తూరులో పాఠశాలలో విద్య నేర్చుకుంది. ఆ తర్వాత తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి పెంచుకుంది.

పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది సాయి పల్లవి. ఎనిమిదో తరగతిలో ఉండగా ఆమె డాన్స్ చూసిన ఓ దర్శకుడు ధాంధూం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ (Kangana Ranaut) పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. ఆ తర్వాత మీరా జాస్మిన్ (Meera Jasmine) క్లాస్ మేట్‌గా పందెం కోడి (Pandem Kodi) సినిమాలో కూడా నటించింది. అయితే అవన్నీ ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. కేవలం అతిథి పాత్రలు మాత్రమే. ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంది. తమిళనాట కూడా ఈమె డాన్స్ షోల్లో పాల్గొంది. తండ్రి కోరిక మేరకు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియాలో డాక్టర్ విద్య అభ్యసించడానికి వెళ్లింది. అక్కడే నాలుగేళ్ళు ఎంబీబీఎస్ పూర్తి చేసింది. నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో పుతిరన్ ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించమని అడిగాడు. అలా సాయి పల్లవి మళ్లీ సినిమా ఇండస్ట్రీకి వచ్చింది. ప్రేమమ్ సూపర్ హిట్ కావడం.. అందులో ఆమె చేసిన మలర్ పాత్రకు ఊహించని రెస్పాన్స్ రావడంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) తో చేసిన కాళి సినిమా కూడా విజయం సాధించింది. 2017లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో వచ్చిన ఫిదా (Fidaa) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి భాన్సువాడ భానుమతిగా పరిచయం అయింది. ఈ సినిమా తర్వాత సాయి పల్లవికి తెలుగులోనూ స్టార్ డమ్ వచ్చింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత నాని (Nani) సరసన ఎంసీఏ  చిత్రంలో నటించింది. అది కూడా బ్లాక్‌బస్టర్ అయింది. సాయి పల్లవికి హిట్ – ఫ్లాపులతో పని లేకుండా మంచి పాపులారిటీ వచ్చింది. కణం, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ   లాంటి సినిమాలు ఈమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ప్రస్తుతం తెలుగులో రానా హీరోగా నటిస్తున్న విరాట పర్వం సినిమాలో నటిస్తుంది. శ్యామ్ సింగరాయ్ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తుంది.

Sai Pallavi - All Results

 

Live Now

    Top Stories