పేరు : పీవీ సింధు
పుట్టిన తేదీ : 5 జులై 1995
ఘనత : వరుసగా రెండు ఒలింపిక్స్ (Olympics) లో పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా అథ్లెట్. బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ గెలిచిన ఏకైక భారత షట్లర్.
పూసర్ల వెంకట సింధు భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్. 1995 జులై 5న హైదరాబాద్‌లో (Hyderabad) జన్మించిన సింధు.. చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌లో మంచి ప్రదర్శన చేసింది. పీవీ సింధు తల్లిదండ్రులు కూడా అథ్లెట్లే. పీవీ రమణ, పి. విజయ జాతీయ వాలీబాల్ క్రీడాకారులు. సియోల్ ఒలింపిక్స్‌లో భారత జట్టు వాలీబాల్‌లో కాంస్య పతకం సాధించింది. ఆ జట్టులో పీవీ రమణ కూడా ఉన్నారు. ఇక సింధు 2001లో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ అయిన పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) స్పూర్తిగా ఈ క్రీడలోకి ప్రవేశించింది. 8 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే రాకెట్ చేతిలో పట్టింది. సికింద్రాబాద్‌లోని మహబూబ్ అలీ దగ్గర శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి మరింతగా రాటు తేలింది. అండర్ 10, అండర్ 13 కేటగిరీల్లో పలు పతకాలు గెలిచింది. రియో (Rio Olympics), టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)లో పతకాలు సాధించింది. ఇక 2019లో బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. 2018 గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ (Commenwealth Games) లో స్వర్ణ పతకం సాధించింది.