ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనం జనసేన పార్టీ (Janasena Party). టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 2014 మార్చి 14న జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. శాంతి, సమానత్వం, విప్లవాలను సూచిస్తూ పార్టీ జెండాను తెలుపు, ఎరుపు రంగులతో రూపొందించారు. పార్టీ ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం (Telugu Desham party), భారతీయ జనతా పార్టీలకు (Bharatiya Janatha Party) మద్దతుగా నిలిచింది. నరేంద్ర మోదీ (Narendra Modi), చంద్రబాబుతో (Nara Chandra Babu Naidu) కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి విజయం సాధించినా జనసేన మాత్రం ఎలాంటి పదవులు తీసుకోలేదు. రాష్ట్ర అభివృద్ధి, ప్రత్యేక హోదా అంశాల్లో తెలుగుదేశం, బీజేపీలతో విభేదించిన పవన్ కల్యాణ్ కూటమి నుంచి బయటకు వచ్చారు.
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం
2019 ఎన్నికల్లో వామనపక్షాలు, బీఎస్పీతో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన జనసేన కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad) మాత్రమే విజయం సాధించారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా గాజువాక (Gajuwaka), భీమవరం (Bhimavaram)లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ రెండు చోట్లా ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం 6శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.
మళ్లీ బీజేపీతో పొత్తు..
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వామపక్ష పార్టీలకు దూరంగా జరిగిన జనసేన పార్టీ.. 2020లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుపెట్టుకుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.