Telugu News » Tag » Aadhaar
Aadhaar Card

Aadhaar వార్తలు

    ఆధార్ కార్డ్ (Aadhaar Card) భారత ప్రభుత్వానికి చెందిన చట్టబద్ధమైన అధికార సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసే గుర్తింపు కార్డ్ ఇది. ఈ సంస్థ జారీ చేసే 12 అంకెల యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను (UID) ఆధార్ నెంబర్ అంటారు. ఆధార్ కార్డుపై ఉండే 12 అంకెల నెంబర్ విభిన్నమైనది. అంటే ఎవరి ఆధార్ నెంబర్ (Aadhaar Number) వారికి ఉంటుంది. ఒకే నెంబర్‌తో రెండు ఆధార్ కార్డులు (Aadhaar Card) ఉండవు. ఆధార్ కార్డును జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2009 జనవరిలో యూఐడీఏఐని స్థాపించింది. ఆ తర్వాత ఈ సంస్థకు చట్టబద్ధత కల్పించింది. ఈ సంస్థ భారత పౌరులందరికీ ఆధార్ కార్డుల్ని జారీ చేస్తుంది. 2021 డిసెంబర్ 7 నాటికి యూఐడీఏఐ 131,67,68,364 ఆధార్ కార్డుల్ని జారీ చేసింది.

    ఆధార్ కార్డుపై ఆధార్ కార్డ్ హోల్డర్ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, అడ్రస్ లాంటి వివరాలు ఉంటాయి. ఈ వివరాలతో ఆధార్ కార్డును చట్టబద్ధత గల యూఐడీఏఐ జారీ చేస్తుంది కాబట్టి ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగిస్తుంటారు. అంతేకాదు… ప్రభుత్వ పథకాలు పొందడానికి ఆధార్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్‌గా సమర్పించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రజలకు అందించేందుకు ఆధార్ నెంబర్ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ షాపుల్లో సరుకులు తీసుకోవడానికి ఆధార్ కార్డ్ ఉంటే చాలు. ఇక ఉపాధి హామీ పథకం, పీఎం కిసాన్ స్కీమ్ లాంటి పథకాలకు కూడా ఆధార్‌ను ముఖ్యమైన డాక్యుమెంట్‌గా పరిగణలోకి తీసుకుంటోంది యూఐడీఏఐ.

    బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర్నుంచి ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం వరకు ప్రతీ చోటా ఇప్పుడు ఆధార్ నెంబర్ అవసరం అవుతోంది. భారత పౌరులకు ఆధార్ సేవల్ని అందించేందుకు యూఐడీఏఐ దేశవ్యాప్తంగా ఆధార్ సేవా కేంద్రాలను, ఆధార్ సెంటర్లను నిర్వహిస్తోంది. ఈ సెంటర్లలో కొత్తగా ఆధార్ కార్డుకు ఎన్‌రోల్ చేయడం దగ్గర్నుంచి ఆధార్ కార్డులో ఉన్న వివరాలను అప్‌డేట్ చేయడం వరకు అనేక సేవల్ని పొందొచ్చు.