భారత ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ కింద... గ్రామాల్లో చెత్త, వ్యర్థాల్ని సేకరించి.. వాటిని మళ్లీ ఉపయోగకరంగా మార్చడానికి బీహార్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్రమంలో జముయ్ జిల్లాలో ఓ ప్లాంట్ ఏర్పాటైంది. గోబర్ ధన్ యోజనలో భాగంగా దీన్ని ఏర్పాటుచేశారు. ఇక్కడ ఆవు పేడను గోబర్ గ్యాస్, సేంద్రియ ఎరువుల తయారీలో వాడుతున్నారు. ఇది జిల్లా యంత్రాంగానికి ఆదాయం ఇస్తోంది. ఈ కేంద్రాన్ని బయో టూరిజంగా అభివృద్ధి చేస్తున్నారు.
కొన్ని నెలలుగా జముయ్ జిల్లా యంత్రాంగం.. స్వచ్ఛత రంగంలో అనేక విజయాలు సాధించింది. అధికారులు మిషన్ మోడ్‌లో నిరంతరం పనిచేస్తూ, నగరం తర్వాత గ్రామాల్లో వ్యర్థాల నిర్మూలన, నిర్వహణ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా చెత్త నిర్మూలన, పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రవ్యాప్తంగా జముయ్ జిల్లా ఆదర్శంగా నిలిచింది.
బీహార్‌లోని మొదటి గోబర్ ధన్ బయోగ్యాస్ ప్లాంట్‌ను జముయ్ జిల్లా... లక్ష్మీపూర్ బ్లాక్‌లోని... దోన్హా గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. దాంతో పాటూ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. సమీపంలోని పంచాయతీ వ్యర్థాల్ని ఇక్కడే పారేస్తున్నారు. ఆవు పేడతో గ్యాస్ తయారుచేసే ఈ ప్లాంట్‌ను సమాధాన్ యాత్రలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ యూనిట్... ఆవు పేడ నుంచి వంటగ్యాస్, సేంద్రీయ ఎరువుల్ని ఉత్పత్తి చేస్తోంది.