Viral: సమాజానికి మేలు చేసే వారిని మెచ్చుకునే సహృదయం మన సొంతం. అందుకే మనం ఇప్పుడు నిరాల్ పటేల్‌ను పరిచయం చేసుకుందాం. గుజరాత్... బనస్కాంత జిల్లాకు చెందిన నిరాల్ పటేల్... ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి ఎక్కాడు. ఆయన అరుదైన మొక్కలు, వాటి విత్తనాలు సేకరించాడు. కరోనా టైమ్‌లో ఆ విత్తనాలను దేశ ప్రజలకు ఉచితంగా ఇచ్చాడు.
ఇప్పటివరకూ 350 రకాల అరుదైన మొక్కలు, చెట్లు, పాదుల విత్తనాలు సేకరించాడు. వాటిని తనలాంటి ప్రకృతి ప్రేమికులకు ఉచితంగా ఇచ్చాడు. అలాగే సోషల్ మీడియాలో చాలా ఎన్విరాన్మెంటల్ గ్రూపుల్లో చేరాడు. తద్వారా... అరుదైన మొక్కల వివరాలు తెలుసుకున్నాడు. అడవుల్లో తిరిగి... అలాంటి వాటిని సేకరించాడు. తర్వాత... వాటిని కోరేవారి వివరాల్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని... వారికి ఉచితంగా ఇస్తున్నాడు.
తాజాగా నిరాల్... ఫేస్బుక్లో పలన్‌పూర్ సీడ్ బ్యాంక్ (Palanpur Seed Bank) అనే పేజీని తయారుచేశాడు. దాని ద్వారా 10వేల మందికి ఉచితంగా కోటి విత్తనాలు ఇచ్చాడు. గుజరాత్తోపాటూ... చాలా రాష్ట్రాల ప్రజలు వాటిని పొందారు. కొరియర్ ద్వారా ఇవి వారిని చేరేవి. అతని కృషిని గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్... అతన్ని గోల్డ్ మెడల్, సర్టిఫికెట్తో సత్కరించింది.
నిరాల్ పటేల్ కోరేది ఒక్కటే... ఎక్కువ మంది ప్రజలు మొక్కల్ని పెంచాలి. అవి చెట్లుగా మారాక... వాటంతట అవే పెరుగుతాయి. స్కూల్ పిల్లలు కూడా మొక్కలు నాటేలా తల్లిదండ్రులు వారిని ఎంకరేజ్ చెయ్యాలని కోరుతున్నాడు. మొక్కలు మన నుంచి కోరేది ఏమీ ఉండదు.. రోజూ కాసిన్ని నీరు పోస్తే అవే పెరుగుతాయి అని నిరాల్ చెబుతున్నాడు. అతని ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుందాం.