World AIDS Day : ప్రపంచంలో కొన్ని రకాల వ్యాధులు, వైరస్‌లకు ఎన్నేళ్లైనా మందును కనిపెట్టలేకపోతున్నారు. 1980ల కాలంలో వచ్చిన HIV / AIDSకి ఇప్పటికీ మందు లేదు. కాకపోతే.. కొన్ని రకాల మందులతో.. ఈ వ్యాధిని కంట్రోల్ చెయ్యగలుగుతున్నారు. పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కావట్లేదు. అందువల్ల ఎయిడ్స్ సోకిన వారు ఆ వ్యాధి నుంచి బయటపడలేకపోయినా.. మందులు వాడటం ద్వారా.. దాదాపు 12 ఏళ్లపాటూ బతికే అవకాశాలు ఉంటున్నాయి. కరోనా లాంటి వైరస్‌కి ఏడాదిలోనే వ్యాక్సిన్ తేవగలిగారు గానీ.. ఎయిడ్స్ వచ్చి.. 40 ఏళ్లైనా ఇప్పటికీ దానికి విరుగుడు కనిపెట్టలేకపోయారంటే.. ఆ వైరస్ మొండిదో అర్థం చేసుకోవచ్చు.
కరోనా లాంటి వైరస్ నుంచి తప్పించుకోవడం కష్టమైంది. కానీ ఎయిడ్స్‌కి కారణమయ్యే. హ్యూమన్ ఇమ్యునో డిఫిషియన్సీ వైరస్ (HIV) నుంచి మాత్రం మనం తప్పించుకోవచ్చు. లైంగిక అంశాల (sexual practices) వల్ల ఈ వైరస్ సోకుతున్నా.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇది సోకకుండా చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిజానికి 1980లో ఎయిడ్స్ వచ్చిన కొత్తలో ప్రపంచ ప్రజలు తీవ్రంగా భయపడ్డారు. ఇక యుగాంతం వచ్చేసినట్లే అనుకున్నారు. మొత్తం మానవాళిని ఈ వైరస్ కబళిస్తుందని అనుకున్నారు. అప్పట్లో ప్రభుత్వాలు సైతం.. ఎయిడ్స్‌పై అత్యంత భయంకరమైన యాడ్స్ ఇచ్చాయి. అవి చూసి ప్రజలు వణికిపోయారు. కానీ కాలక్రమంలో.. ఎయిడ్స్ అనేది అప్రమత్తంగా లేని వారికి మాత్రమే సోకుతుందని తేలడంతో.. ఊపిరి పీల్చుకున్నారు.
ఎయిడ్స్ వైరస్ శరీరంలో చేరితే.. అది మనుషుల వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. అందువల్ల ఈ వ్యాధి సోకిన వారు.. ఇమ్యూనిటీని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. అందుకు తగిన మందులు వాడుతూ.. ఎక్కువ కాలం జీవించేందుకు ప్రయత్నిస్తారు. అనుకోకుండా ఈ వైరస్ సోకిన వారు.. భయపడాల్సిన పనిలేదు. మందులు వాడుతూ.. డాక్టర్ల సలహాలు పాటిస్తూ.. ఎప్పట్లాగే జీవించవచ్చు.
ఎంతలా కంట్రోల్ చేసినా.. ఇప్పటికీ ప్రపంచ దేశాలను ఎయిడ్స్ ఇబ్బంది పెడుతూనే ఉంది. పూర్తిగా ఇది తొలగట్లేదు. ఈ క్రమంలో ఏటా ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు.. 1988లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తొలిసారి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరిపింది. వ్యాధి వైరస్‌ని కనిపెట్టిన నాలుగేళ్ల తర్వాత ఇది జరిగింది. ఇప్పటివరకూ ఎయిడ్స్‌తో 3.5 కోట్ల మందికి పైగా చనిపోయారు. ప్రస్తుతం ఏటా 15 లక్షల మంది ఎయిడ్స్ వ్యాధికి మందులు వాడుతున్నారు.