Gujarat Drone farming: మన దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే... వ్యవసాయంలో ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నారు గుజరాత్ రైతులు. అక్కడి కొన్ని జిల్లాల్లో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం (organic farming) చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అరుదైన పంటల్ని పండిస్తున్నారు. తాజాగా... బనస్కాంత జిల్లా రైతులు... మరో అడుగు ముందుకేశారు. అక్కడి దీశాకి చెందిన రైతు కన్వర్జీ ఠాగూర్... కూరగాయల పంటలపై డ్రోన్లతో పురుగు మందుల్ని చల్లుతున్నారు. దీని వల్ల ఎంతో టైమ్ సేవ్ అవుతోంది. తక్కువ నీరు సరిపోతుంది. కూలీల ఖర్చు కూడా లేకుండా పోయింది. బనస్కాంత జిల్లాలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయమే చేస్తారు.
బనస్కాంత జిల్లాలో నీటి కొరత ఉంది. వ్యవసాయంలో నీటిని పొదుపుగా వాడుతారు. ఇక పురుగుమందులను పొలాల్లో చల్లడం అనేది ఇక్కడి రైతులకు అది పెద్ద సమస్య. ఎందుకంటే... పురుగుమందులు పిచికారీ చేసేటప్పుడు... అవి గాలిలో ఎగురుతూ... రైతులు కూడా పీల్చే పరిస్థితి వస్తోంది. దీని వల్ల చాలా మంది అనారోగ్యాలపాలవుతున్నారు. రైతులు మనస్శాంతిగా వ్యవసాయ పనులు చేయలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో... దీశాలోని రణపూర్ గ్రామానికి చెందిన కన్వర్జీ ఠాగూర్ చేసిన ప్రయోగం మంచి ఫలితం ఇచ్చింది. డ్రోన్లతో పురుగు మందులు చల్లిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్న ఆయన... ప్రయత్నించాడు. సక్సెస్ అయ్యాడు. ఇన్నాళ్లూ ఫొటోలు, వీడియోలకే పరిమితమైన డ్రోన్లను ఇప్పుడు ఆయన వ్యవసాయ పనులకు కూడా వాడేస్తున్నాడు.
డ్రోన్లు కంప్యూటర్ ఆధారిత సాఫ్ట్వేర్ ద్వారా పనిచేస్తాయి. కాబట్టి... అవి పొలం మొత్తానికీ ఒకేరకంగా పురుగు మందును చల్లుతున్నాయి. అలాగే... వేగంగా పనైపోతోంది. ఇకపై మిగతా రైతులు కూడా ఈ విధమైన టెక్నాలజీని తమ పొలాల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రోన్లతో చాలా తక్కువ ఖర్చుకే పిచికారీ పూర్తవుతోందని ఠాగూర్ తెలిపాడు.
ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకి తెలిసింది. అదేంటో కళ్లారా చూడాలని ఆయన ఠాగూర్ పొలానికి వచ్చారు. దగ్గరుండి డ్రోన్ ఎలా పనిచేస్తోందో, దాన్లో పురుగు మందులు ఎలా నింపుతున్నారో అన్నీ తెలుసుకున్నారు. మోడ్రన్ వ్యవసాయం చేస్తున్న బనస్కాంత రైతులంతా ఈ టెక్నాలజీని వాడేసుకునేలా ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు ప్రారంభిస్తామని తెలిపారు.