తమ మధురమైన క్షణాలను పదిలం చేసుకునేందుకు చాలా మంది మొబైల్లో సెల్ఫీలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఈ మధ్య కాలంలో ప్రతీచోట సెల్ఫీల అలవాటు విపరీతంగా పెరిగిపోయింది. అయితే వీటితో ప్రమాదాలు కూడా అధికమవుతున్నాయి. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.
దీంతో అక్కడక్కడ ప్రభుత్వాలు సెల్ఫీలపై ఆంక్షలు కూడా విధిస్తున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే.. సెల్ఫీల సమయంలో చనిపోతున్న వారి సంఖ్య ప్రపంచంలో భారత్‌లోనే అధికంగా ఉండగా... ఆ తర్వాత రష్యా, అమెరికా, పాకిస్థాన్ ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, నీటి ప్రవాహాల సమీపంలో, ప్రయాణం చేస్తున్నప్పుడు సెల్ఫీలు తీసుకున్న సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడి సపుత్ర హిల్స్టేషన్తో పాటు వాటర్‌ఫాల్స్ దగ్గరికి టూరిస్ట్‌లు అధిక సంఖ్యలో వస్తారు. అందులోనూ ప్రస్తుతం కరోనా కేసులు సంఖ్య కూడా తగ్గుతుండడంతో రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. ఇక్కడ సెల్ఫీలు తీసుకునే క్రమంలో ప్రమాదాల బారిన పడుతుండటంతో వీటిని అదుపు చేసేందుకు పోలీసు అధికారులు కొత్త నిబంధనలు ప్రకటించారు.
దంగ్ జిల్లా పరిధిలో సెల్ఫీలు దిగుతూ ఎవరైనా పట్టుబడితే క్రిమినల్ నేరం కింద కేసులు నమోదు చేస్తామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని జిల్లా అడిషనల్ కలెక్టర్ టీడీ దామోదర్ మీడియాకు చెప్పారు. గతంలోనూ ఇలాంటి ఆంక్షలు ఉన్నా.. ఇప్పుడు మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తున్నామని, ఈ ఆంక్షలను పక్కాగా అమలు చేస్తామని అన్నారు.
“ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో కొందరు ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన ఘటనలు జరిగాయి. అలాంటి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రమాదకర ప్రాంతంలో సెల్ఫీలకు ప్రయత్నించి ప్రమాదాల బారిన పడుతున్నారు. లోయల్లో పడడం, నీళ్లలో కొట్టుకుపోవడం లాంటి ఘటనలు గతంలో జరిగాయి” అని ఆయన పేర్కొన్నారు.
సెల్ఫీలు తీసుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ జిల్లాలో బోర్డులను సూచిక ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. 2018 జూలైలో సపుతరలో సెల్ఫీ తీసుకుంటూ ఓ యువకుడు లోయలో పడి మృతి చెందాడు. ఆ తర్వాత మరో వ్యక్తి గిర వాటర్‌ఫాల్స్ సమీపంలో చనిపోయాడు. అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం.. 2011 నుంచి 2017 మధ్య సెల్ఫీలు తీసుకుంటూ భారత్‌లో 259 మంది మృతి చెందారు. అలాగే గత మూడేళ్ల నుంచి కూడా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.