ఇండియా... గుజరాత్‌లోని ఆ గ్రామంలో 7,600 ఇళ్లు ఉన్నాయి. దేనికవే విడివిడిగా ఉంటాయి. మన దేశంలో బ్యాంకులకు ఆ గ్రామం అత్యంత ముఖ్యం. అందుకే అక్కడ ఏకంగా 17 బ్యాంకులు ఉన్నాయి. దేశంలోని మరే గ్రామంలోనూ అన్ని బ్యాంకులు లేవు. ఆ 17 బ్యాంకుల్లోనూ నెల నెలా భారీగా డబ్బు జమ (deposit) అవుతూ ఉంటుంది. ఆ గ్రామ ప్రజలకు యూరప్‌లోని లండన్‌తో సంబంధాలున్నాయి. ఎందుకంటే... ఆ ఊరికి చెందిన వారిలో సగం మందికిపైగా లండన్ లేదా యూరప్‌లో ఉంటున్నారు. ఈ సంపన్న గ్రామాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తారు.
ఈ గ్రామం పేరు మాధాపర్ (madhapar). ఇది మన దేశంలోని రెగ్యులర్ గ్రామాల్లా ఉండదు. విదేశాల్లోని గ్రామాల లాగా చాలా మోడ్రన్‌గా ఉంటుంది. మన దేశంలోని ఏ గ్రామ ప్రజలూ... విదేశాల్లో క్లబ్ ఏర్పాటు చెయ్యలేదు. ఈ గ్రామ ప్రజలు మాత్రం లండన్‌లో సొంత క్లబ్ ఏర్పాటుచేసుకున్నారు. ఇక్కడ దానికో ఆఫీస్ కూడా ఉంది. దీన్ని బట్టీ ఈ గ్రామం ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
కచ్ జిల్లాలో ఉన్న మాధాపర్ గ్రామంలో... హిందీ, ఇంగ్లీష్ మీడియం చెప్పేలా ప్లే స్కూల్ నుంచి ఇంటర్ కాలేజీ వరకూ విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ గ్రామానికి సొంతంగా ఓ షాపింగ్ మాల్ కూడా ఉంది. అక్కడ ప్రపంచంలోని పెద్ద పెద్ద బ్రాండ్ల ఐటెమ్స్ అన్నీ లభిస్తాయి. ఈ ఊళ్లో చెరువంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. అది పిల్లలు కూడా స్విమ్మింగ్ చేసేందుకు వీలుగా ఉంది. అలా ఈ ఊరిని స్వర్గంలా తీర్చిదిద్దుకున్నారు.