దేశవ్యాప్తంగా ఉన్న 543 లోక్ సభ సీట్లలో ఒకానొక హాట్ సీటుగా ఉజ్జయిని ఎంపీ స్థానానికి పేరుంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి తరఫున అనిల్ ఫిరోజియా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారీ కాయుడైనప్పటికీ ప్రజాసేవలో ఒళ్లొంచి పనిచేస్తారని ఆయనకు పేరుంది. అంతేకాదు, ఒళ్లు కరిగించడం ద్వారా నిధులు పొందే అవకాశం దక్కిన ఏకైక ఎంపీ కూడా ఆయనే.
బీజేపీ నేత, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం యోగా, స్విమింగ్, సైక్లింగ్‌తో తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. కఠినమైన ఆహార నియమాలను పాటిస్తున్నారు. సాధారణంగా నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం ఎంపీలు ఢిల్లీలో చక్కర్లు కొడితే, ఈయన మాత్రం తాపీగా ఇంట్లోనే ఉంటూ వ్యాయామాలు చేస్తున్నారు.
అనిల్ బరువుకు నియోజకవర్గ అభివృద్ధికి లింకు ఏర్పడటానికి కారకుడు మరెవరో కాదు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీనే. భారీ కాయుడైన అనిల్‌ను బరువు తగ్గితేనే ఉజ్జయినికి నిధులు కేటాయిస్తానని కేంద్ర రోడ్డు, రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో షరతు పెట్టారు. గడ్కీర మాట మీద నిలబడే నేత కావడంతో ఆ ఛాలెంజ్ ను సీరియస్ గా తీసుకున్నారు ఎంపీ అనిల్.
‘ఉజ్జయిని నియోజకవర్గ అభివృద్ధి కోసం అనిల్ ఫిరోజియా నిధులు కావాలని పదే పదే అడుగుతున్నారు. అయితే, ఓ షరతు పెడుతున్నాను. భారీ కాయుడైన అనిల్ ఎన్ని కిలోల బరువు తగ్గితే 1కిలోకు రూ.1000 కోట్ల చొప్పున నియోజకవర్గానికి నిధులను కేటాయిస్తా. బరువు తగ్గడం నిజంగా తేలికైన పనే. స్వయంగా నేను 135 కిలోల నుంచి 93 కిలోలలకు తగ్గాను.’అని నితిన్ గడ్కరీ సభాముఖంగా సెలవిచ్చారు.
త్వరలో జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో తాను బరువు తగ్గిన వివరాలను కేంద్ర మంత్రి గడ్కరీకి చెబుతానని ఎంపీ అనిల్ ఫిరోజియా తెలిపారు. మాటిచ్చిన విధంగా ఉజ్జయిని నియోజకవర్గానికి గడ్కరీ రూ.15వేల కోట్ల నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. తొలి విడత నిధులు వచ్చాక, ఇంకాస్త బరువు తగ్గి, మరిన్ని నిధులు సాధించేదిశగా అనిల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.