రెండు నెలలపాటు టమాటా ధరలు ఆకాశంలోనే విహరిస్తాయని, జనవరి తర్వాతగానీ టమాటా ధరలు కొద్దిగా దిగివస్తాయని క్రిసిల్ ఆధారాలతో కూడిన అంచనాలు వేసింది. మరోవైపు, టమాటా అధిక ధరలపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఈ ఏడాది ఎంత శాతం ధర పెరిగిందో చెబుతూ, దాన్ని కిందికి దించడానికి చేపట్టిన చర్యలను కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అకాల వర్షాలు, అధిక వర్షాలతో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. ప్రధానంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. హైదరాబాద్ సహా దేశంలోని అన్ని నగరాల్లో కిలో టమాటా ధర రూ.120కిపైగానే పలుకుతోంది. కొద్ది వారాలుగా కిలో టమాటా రూ.100కుపైపైనే తిరుగుతోంది. కాగా, ఈ అధిక ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది. మరో రెండు నెలల వరకు టమాటా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా లేవు. రాబోయే రోజుల్లో కిలో టమాటా రూ.200 చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.
దేశంలో టమాటా అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో సాధారణ వర్షపాతానికి మించి 105%, ఆంధ్రప్రదేశ్లో సాధారణానికి మించి 40%, మహారాష్ట్రలో 22% అధికంగా వానలు నమోదు కావడం, దీంతో, అక్టోబర్-డిసెంబర్ కాలంలో కీలక సరఫరాదారులైన ఈ మూడు రాష్ట్రాల్లో చేతికొచ్చిన టమాటా పంట నేలపాలైందని క్రిసిల్ అంటోంది.
కొత్తగా పంట వస్తే టమాటా ధర 30% మేర తగ్గుతుందని క్రిసిల్ చెబుతోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం టమాటా అధిక ధరల ప్రభావం డిసెంబర్ నుంచి తగ్గుతుందని చెబుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా తాజా పంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని పేర్కొంది. ఉల్లి ధరలు కూడా మరో 10-15 రోజుల తర్వాతే తగ్గుతాయని క్రిసిల్ తెలిపింది.
వాస్తవ మార్కెట్లో టమాటా ధర 150 శాతానికి పెరిగినా, కేంద్రం లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది టమాటా ధరలు 63 శాతం అధికమని కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ పేర్కొంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగా; కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడంతో సరుకు రవాణా కాలేదని, సెప్టెంబర్ చివరి వారం నుంచి ధరలు క్రమంగా పెరుతూ వచ్చాయని తెలిపింది.
టమాటా ధరల అదుపు కోసం ధరల స్థిరీకరణ నిధి కింద రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, ఇప్పటికే ఏపీ, తెలంగాణ, ఒడిశా, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కేంద్రం వాటా నుంచి రూ.164 కోట్లు విడుదలయ్యాయని, కాబట్టి రాష్ట్రాలు నిత్యావసర ధరల నియంత్రణకు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ సూచించింది.