World Population : చైనాలో జనాభా తగ్గుతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. మొన్నటివరకూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. నవంబర్‌లో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరింది. ఈ విషయం ఆశ్చర్యం కలిగించేదే. ఎందుకంటే 1900 మధ్య నుంచి.. ప్రపంచ జనాభా వృద్ధి రేటు వేగంగా పెరిగింది. ఈ వృద్ధికి భారతదేశం, చైనా ప్రధాన కారణం కాగా.. ఆఫ్రికా దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తాజాగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. చైనా రెండో స్థానానికి పడిపోయింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో కొన్నేళ్లుగా జనాభా సంఖ్య వేగంగా తతోంది. ఐక్యరాజ్యసమితి 2019 డేటా ప్రకారం జనాభా చాలా వేగంగా తగ్గుతున్న ప్రపంచంలోని అగ్ర దేశాలేవో తెలుసుకుందాం. (Image credit - wikimedia commons)
ప్రపంచంలో అత్యధికంగా జనాభా తగ్గిపోతున్న దేశం బల్గేరియా. అక్కడ జనాభా 2020లో 69 లక్షల నుంచి 2050 నాటికి 54 లక్షలకు తగ్గిపోతుందని అంచనా. అంటే తగ్గుదల రేటు 22.5 శాతం. ఆ తర్వాత లిథువేనియా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 2050 నాటికి జనాభా 22.1 శాతం తగ్గుతుంది. తర్వాత యూరప్ ఖండంలోని లాత్వియా 21.6 శాతం క్షీణత చూపుతోంది. లాత్వియాలో ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. అక్కడ జననాల రేటు బాగా తగ్గిపోయింది. (Image credit - wikimedia commons)
ఈ ధోరణి ఉక్రెయిన్‌లో కూడా కనిపిస్తుంది. యూరప్ లోని ఈ దేశ జనాభా 2020లో 4.37 కోట్ల నుంచి 2050 నాటికి 3.52 కోట్లకు తగ్గుతుంది. తగ్గుదల రేటు 19.5 శాతం. దీని తర్వాత సెర్బియా జనాభా సంఖ్య 30 సంవత్సరాలలో 18.9 శాతం తగ్గి 87 లక్షల నుంచి 71 లక్షలకు చేరుతుంది. ఆ తర్వాత బోస్నియా, హెర్జెగోవినాలో 2020లో 2.7 కోట్లుగా ఉన్న జనాభా.. 2050 నాటికి 2.2 కోట్లకు తగ్గుతుంది. ఈ రేటు 18.2 శాతంగా ఉంది. ఇక్కడ కూడా జననాల రేటు తగ్గుతోంది. వలసలు పెరుగుతున్నాయి. అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా జనాభా పెద్ద సంఖ్యలో వలసపోతున్నారు, చనిపోతున్నారు. (Image credit - pixabay)
క్రొయేషియా జనాభా కూడా దాదాపు 18 శాతం తగ్గిపోతుందనీ.. రాబోయే 30 ఏళ్లలో ఇది 41 లక్షల నుంచి 34 లక్షలకు పడిపోతుంని అంచనా. అక్కడ జనాభా అత్యధికంగా 1991 సంవత్సరంలో 47.8 లక్షలు. మోల్డోవాలో ఈ క్షీణత 16.7 శాతం ఉండనుంది. అక్కడ 40 లక్షల నుంచి 34 లక్షలకు జనాభా తగ్గనుంది. మరణాల రేటు పెరగడం, ఆర్థిక కారణాల వల్ల వలసలు, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి అనేక అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. (Image credit - wikimedia commons)
ఈ జాబితాలో ఐరోపా బయట ఒక దేశం తొమ్మిదో స్థానంలో ఉంది. అదే జపాన్. ఈ సంపన్న దేశం జనాభా 2020 నుంచి 2050 నాటికి జనాభా సంఖ్య 12.65 కోట్ల నుంచి 10.58 కోట్లకు తగ్గిపోతుందనీ.. ఈ క్షీణత 16.3 శాతం ఉంటుందని అంచనా. జపాన్ జనాభా 2011 నుంచి తగ్గుతోంది. ఇక్కడ జననాల రేటు తగ్గడం, ముసలివారి జనాభా పెరగడం వల్ల ఈ పరిస్థితి వస్తోందంటున్నారు. (Image credit - wikimedia commons)
జపాన్ తర్వాత మళ్లీ యూరోపియన్ దేశాలు ర్యాంకుల్లో ఉన్నాయి. వచ్చే 30 ఏళ్లలో.. అల్బేనియాలో 15.8 శాతం, రొమేనియాలో 15.5 శాతం, గ్రీస్‌లో 13.4 శాతం, ఎస్టోనియాలో 12.7 శాతం, హంగేరీలో 12.3 శాతం జనభా తగ్గుదల కనిపించనుంది. అల్బేనియా జనాభాలో 38 శాతం మంది విదేశాల్లో నివసిస్తున్నారని అంచనా. రొమేనియాలో కూడా వలసలు పెరుగుతున్నాయి. గ్రీస్‌లో జననాల రేటు ప్రతికూలంగా ఉంది. యూరప్ దేశాల్లో బతకాలంటే భారీగా ఖర్చవుతుంది. ప్రజల ఆదాయాలు అంతగా లేవు. అందుకే వలస వెళ్లిపోతున్నారు. (Image credit - wikimedia commons)