వర్తమాన చరిత్రలో Jai Bhim (జై భీమ్)పై జరుగుతోన్నంత చర్చ మరే ఇతర సినిమాపైనా జరగలేదు. అణగారిన కులాలపై కొనసాగుతోన్న దాష్టీకాలు, కింది కులాల వారి హక్కుల హననం, కమ్యూనిస్టు దృక్కోణం, పోలీస్ కేసుల్లో ఇప్పటికీ కులాల ప్రస్తావన, లాయర్ వృత్తి కమర్షిల్ అయిపోవడం, హక్కుల కార్యకర్తలు జైలు పాలు కావడం.. ఇలా జై భీమ్ చుట్టూ అల్లుకుని ఉన్న పదుల కొద్దీ అంశాలపై పుంఖానుపుంఖాలుగా రాతలు వెలువడుతున్నాయి.
సోషల్ మీడియాతోపాటు బయటా జై భీమ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. బయోపిక్ జానర్ లో తెరకెక్కిన జై భీమ్ సినిమాలో తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు జీవితాన్ని, ఆయన వాదించిన రాజకన్ను(రాజన్న) కేసును, న్యాయం కోసం రాజకన్ను(రాజన్న) భార్య పార్వతి(సినతల్లి) చేసిన పోరాటాన్ని హృద్యంగా చిత్రీకరించారు దర్శకుడు జ్ఞానవేల్. ట్విస్టింగ్ అంశమేంటంటే..
ఇంత పెద్ద హిట్ సినిమాలో చూపించిన నిజజీవిత గాధలో సినతల్లి(పార్వతమ్మ) ఇప్పుడేం చేస్తోందో, ఆమె పరిస్థితి ఎలా ఉందో పెద్దగా తెలీదని జస్టిస్ చంద్రు చెప్పడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆ తర్వాత మరికొన్ని మీడియా సంస్థలు నేరుగా పార్మతమ్మను వెతికిపట్టుకున్నా ఆమెకు సంబంధించిన వాస్తవ పరిస్థితి మాత్రం దర్శక నటుడు రాఘవ లారెన్స్ ద్వారానే వెలుగులోకి వచ్చిదని చెప్పాలి..
జై భీమ్ సినిమాలో చూపించిన రియల్ సినతల్లి పార్వతి ప్రస్తుత ఫొటోను షేర్ చేస్తూ రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు. చేయని తప్పుకు పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురై మరణించిన రాజాకన్ను(రాజన్న) కుటుంబాన్ని తాను ఆదుకుంటానని లారెన్స్ ముందుకొచ్చారు. రాజాకన్ను భార్యకు పార్వతమ్మకు ఇల్లు కట్టి ఇస్తానని ప్రకటించారు. ఈ మేరకు లారెన్స్ సోమవారం చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున హర్షాతికేరాలు వ్యక్తమయ్యాయి.
జై భీమ్ సినిమాలోని సెంగెయి లేదా సినతల్లి అయిన పార్వతి నిజజీవితంలోనూ తమిళనాడులోని కడలూరు జిల్లాలోనే జీవిస్తున్నారు. అక్కడి ముధనవి గ్రామంలో ఇప్పటికీ కూలీ పనులు చేసుకుంటూ కనిపిస్తారు పార్వతమ్మ. కోర్టు ఆమెకు నష్టపరిహారంగా డబ్బులిచ్చి, ఇల్లు కట్టించేందుకు ఆదేశాలిచ్చినా, పార్వతి మాత్రం నిరాడంబరంగానే తదుపరి జీవనం కొనసాగిస్తున్నారు.
రియల్ సినతల్లి పార్వతికి ఇల్లు కట్టిస్తానని ముందుకొచ్చిన రాఘవ లారెన్స్ ను చాలా మంది అభినందిస్తున్నారు. కరోనా విలయ కాలంలోనూ లారెన్స్.. ఫ్రంట్ లైన్ వారియర్లు, ట్రాన్స జెండర్లు, పేదల కోసం ఏకంగా 5కోట్ల విరాళాలు ఇవ్వడం తెలిసిందే. జై భీమ్ సినిమాలో సినతల్లి (పార్వతి)గా లిజోమోల్ జోస్, రాజకన్ను (రాజన్న)గా మణికంఠన్, లాయర్ చంద్రు(జస్టిస్ చంద్రు)గా సూర్య, ఇతర పాత్రల్లో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రాజిష విజయన్ జీవించారు.