భూమి పైనుంచి మనను ఎదురుగా కనిపించే చంద్రుడి ఉపరితలం కాకుండా అవతలి వైపు ఉన్న ఉపరితలంపై చైనా 2019 నుంచి పరిశోధనలు చేస్తోంది. చంద్రుడి ఆవలి భాగంలో పరిశోధనలు చేసేందుకు డ్రాగన్ కంట్రీ చాంగే-4 (Chang'e-4) మిషన్ చేపట్టింది. ఇందులో భాగంగా యుటు-2 (Yutu-2) రోవర్‌ను చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఇది 2019 నుంచి చంద్రుని అవతలి వైపు పరిశోధనలో కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే యుటు-2 రోవర్ తాజాగా ఒక నిగూఢ నిర్మాణాన్ని గుర్తించింది.
చంద్రుడి అవతలి ఉపరితలంపై చైనా రోవర్ యుటు-2 గుర్తించిన తాజా నిర్మాణం తాలుకు ఫొటోలను చైనా స్పేస్ ఏజెన్సీ సోమవారం నాడు విడుదల చేసింది. ఈ ఫొటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి ఎందుకంటే, దూరం నుంచి చూస్తే పూరి గుడిసెలా కనిపిస్తుంది. ఆ మిస్టరీ నిర్మాణం ఏలియన్లదే అయి ఉండొచ్చనీ కామెంట్లు వస్తున్నాయి. దీనికి సంబంధించి సైంటిస్టులు సైతం వివరణ ఇచ్చారు..
ప్రస్తుతం చంద్రుడిపై వోన్ కార్మాన్ బిలం(Von Karman crater)లో చక్కర్లు కొడుతున్న ఈ రోవర్... దానికి కేవలం 80 మీటర్ల (262 అడుగులు) దూరంలోనే క్యూబ్ ఆకారంలో ఉన్న ఒక వింత వస్తువును కనుగొన్నది. దీనిని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. దీనికి "రహస్య కుటీరం(Mystery Hut)"గా చైనా శాస్త్రవేత్తలు పేరు కూడా పెట్టారు.
చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA)తో కూడిన చైనీస్ లాంగ్వేజ్ సైన్స్ ఔట్రీచ్ ఛానెల్ అయిన అవర్ స్పేస్ ప్రచురించిన మిషన్ డైరీ ప్రకారం, ఈ ఏడాది నవంబర్‌లో చంద్రుని ఉపరితలంపై 37వ రోజున తిరుగుతున్నప్పుడు రోవర్ ఈ వస్తువును కనిపెట్టింది. "మిస్టరీ హట్"గా పిలుస్తున్న ఈ నిర్మాణాన్ని యుటు-2 బృందం సందర్శించి అన్వేషించడానికి ఆసక్తిని కనబరుస్తోంది.
నివేదికల ప్రకారం, రోవర్ ఈ ప్రాంతంలో వచ్చే రెండు మూడు నెలల పాటు అవుట్క్రాప్(కొత్తగా కనిపెట్టిన వస్తువు)ను అన్వేషించే అవకాశం ఉంది. అయితే దీనిని చేరుకునే ప్రయాణం అత్యంత ప్రమాదకరమైనదిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 80 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఇది అతి పెద్ద సవాలుతో కూడుకున్నదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
"ఊహించని రీతిలో స్కైలైన్ గుండా తలుక్కున మెరిసిన ఈ వస్తువు ఓ 'మర్మమైన గుడిసె' లాగా ఉంది. దాని పక్కన ఓ పెద్ద "బేబీ" ఇంపాక్ట్ బిలం(గుండ్రటి లోయ) ఉంది. క్రాష్ ల్యాండింగ్ తర్వాత ఇది గ్రహాంతరవాసులు నిర్మించిన ఇల్లా? లేక ఇది చంద్రుడిని అన్వేషించడానికి పూర్వీకుల రూపొందించిన అంతరిక్ష నౌకా?" అని మిషన్ డైరీ పేర్కొంది. ఈ వస్తువు ఆసక్తిని రేకెత్తిస్తోందని.. అక్కడికి వెళ్లి దీన్ని చెక్ చేద్దాం పదా అని శాస్త్రవేత్తలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
చైనా Chang'e-5 మిషన్ ఇటీవలే ఘనమైన లావా అవశేషాలు తీసుకొచ్చింది. ఇవి ఇతర మిషన్లు భూమిపైకి తీసుకొచ్చిన పదార్థాల కంటే ఒక బిలియన్ సంవత్సరాల పురాతనమైనవని చైనా వెల్లడించింది. చాంగే-4 మిషన్ ద్వారా 2019లో యుటు-2 రోవర్ ని చంద్రుని ఆవలి ఉపరితలంపై ల్యాండ్ చేశారు. తరువాత దానిని సౌత్ పోల్-ఐట్కెన్(South Pole-Aitken basin) బేసిన్‌లోకి పంపించారు. ఈ రోవర్ సూర్యుని కాంతిని ఎన్నడూ చూడని అంధకారమైన ఉపరితలాన్ని అన్వేషిస్తోంది. ఈ ప్రాంతం ముందరి సమయంలో సౌర వ్యవస్థ, భూమి ఎలా ఉండేవో చెప్పగల రహస్యాలను కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
రోవర్ చంద్రుడి ఉపరితలం మీద పొరను/రెగోలిత్(regolith)ను అధ్యయనం చేయడంతో పాటు 100 మీటర్ల కంటే ఎక్కువ లోతుగా ఉపరితలాన్ని చూడటానికి రెండు రంగుల కెమెరాలతో సహా లూనార్ పెనెట్రేటింగ్ రాడార్ ను కలిగి ఉంది. విజిబుల్, నియర్-ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ అనేది చంద్రుడి ఉపరితలంపై ఖనిజ కూర్పును అధ్యయనం చేస్తుంది. సౌర విండ్(solar win) చంద్ర రెగోలిత్తో ఎలా సంకర్షణ చెందుతుందో తెలుసుకోవడానికి న్యూట్రల్స్ (ASAN) ఫర్ అడ్వాన్స్డ్ స్మాల్ ఎనలైజర్ అధ్యయనం చేస్తుంది.