South-West Monsoon: నైరుతీ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. తొలకరి వర్షాలు పడుతున్నాయి. ఈ కరోనా టెన్షన్లో పడి మనం ఎండాకాలాన్ని పట్టించుకోలేదు. అది రావడం, పోవడం కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు వర్షాకాలం. ఆల్రెడీ ముంబై మునుగుతోంది. రేపు, ఎల్లుండి అక్కడ అతి భారీ వర్షాలు పడతాయట. ఇలా ఒక్క వానకే ముంబై మునిగిపోతుంటే... కొన్ని ప్రాంతాల్లో మరి సంవత్సరమంతా వానలు పడుతూనే ఉన్నాయి. కానీ అక్కడ వరదలు కనిపించవు. ఇళ్లు మునిగిపోవు. రోడ్లు చెరువుల్ని తలపించవు. కానీ... వర్షం మాత్రం కురుస్తూనే ఉంటుంది. భలే కదా.
1. మాసిన్రాం (Mawsynram) ప్రాంతం... మేఘాలయలో ఉంది. ప్రపంచంలోనే అత్యధిక వర్షం కురిసే ప్రాంతం ఇదే. ఎప్పుడు చూసినా చల్లగా, చినుకులతో స్వాగతం పలుకుతుంది. సంవత్సరానికి అక్కడ సగటున 11,872 మిల్లీమీటర్ల వాన పడుతోంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం... 1985లో మాసిన్రామ్లో 26,000 మిల్లీ మీటర్ల వాన పడింది. అంటే 1,000 అంగుళాలు.
2. చిరపుంజి (Cherrapunji) కూడా అలాంటిదే. ఇది మాసిన్రామ్కి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ కూడా ఏడాదికి సగటున 11వేల మిల్లీమీటర్లకు పైగా వాన కురుస్తోంది. ఒకప్పుడు ఇదే అత్యంత ఎక్కువ వాన పడే ప్రాంతంగా ఉండేది. ఆ రికార్డును మాసిన్రామ్ కొట్టేసింది. అయితేనేం చిరపుంచి ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ఇక్కడ ఎండాకాలం కూడా ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల దగ్గరే ఉంటాయి.
3. తుతునెండో (Tutunendo) అనేది దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలో ఉంది. మామూలుగా అయితే కొలంబియాలో ఎండలు ఎక్కువే. కానీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి తుతునెండో. అక్కడ రెయిన్ ఫారెస్టులు ఉన్నాయి. జనాభా వెయ్యి మంది కంటే తక్కువే. ఇక్కడ ఏడాదికి సగటున 11,800 మిల్లీ మీటర్ల వాన పడుతోంది. అందువల్ల భూమిపై తమతే అత్యధిక వర్షం పడే ప్రాంతం అని అక్కడి వారు అంటుంటారు.